Tuesday, June 1, 2010

అమెరికాలో అందమైన భవిష్యత్తు కోసం...

అమెరికాలో అందమైన భవిష్యత్తు కోసం...

అందమైన భవిష్యత్తును వెదుక్కుటూ వేలాదిగా యువతీయువకులు అమెరికా వెళ్తున్నారు. అక్కడి పరిస్థితులపై సరైన అవగాహన లేకపోతే ఇబ్బందులకు గురి కావలసి ఉంటుంది. అంతా బాగానే ఉంటే బంగారు భవిష్యత్తుకు ఢోకా లేదు. కాని అమెరికాలో గాని, మరో దేశంలోగాని ఎక్కడైనా ఏ చిన్న పొరపాటు జరిగినా, చివరికి ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి.

ఈమధ్య కాలంలో అమెరికాలో జరుగుతున్న దుర్ఘటనలు చూస్తుంటే చాలావరకు పరిస్థితులపై సదవగాహన లేకే పిల్లల జీవితాలు అర్థంతరంగా ముగిసిపోతున్నాయని అర్థమవుతున్నది. అందుకే అమెరికా వెళ్లాలనుకునే యువతీ యువకులే కాదు, వారి మిత్రులు, తల్లిదండ్రులు కూడా ఈ మార్గదర్శక సూత్రాలను అనుక్షణం గుర్తుంచుకోవాలి.

navya. వాగ్యుద్ధాలు వద్దు
1. అపరిచితులతో వాగ్వివాదాలు వద్దు. చాలారకాల అభిప్రాయభేదాలు వాగ్యుద్ధంగా మారి ఒకరినొకరు కొట్టుకునే స్ధాయికి చేరతాయి. వాటివల్ల ఉత్తరోత్రా ప్రత్యర్ధి కన్నా మీకే ఎక్కువ నష్టం అన్న విషయం మరిచిపోకండి.

2. అభ్యంతరకరమైన సంజ్ఞలు చేయకండి (ముఖ్యంగా మధ్యవేలు, చూపుడువేలు చూపించటం లాంటివి). తిట్లు, బూతుమాటలు వాడకండి. పొరపాటు అవతలివారిదే అయినా, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. రెండు క్షణాలు నిగ్రహం పాటించగలిగితే పరిస్ధితి దానంతటదే చక్కబడుతుంది. గొడవలు పడకుండా పరిష్కరించుకునే పద్ధ్దతులు చాలా ఉంటాయి.

3. మొరటుగా బెదిరిస్తూ డబ్బు, విలువైన వస్తువులను బలవంతంగా లాక్కునే దొంగలుగానీ, దుండగులుగానీ ఎదురుపడితే ఎంతమాత్రం ప్రతిఘటించకుండా జేబులో ఉన్నవి ఇచ్చేయటం మంచిది. డబ్బుపోతే సంపాదించుకోవచ్చు, విలువైన ప్రాణంపోతే తిరిగి రాదు.

4. తోటి భారతీయులు తారసపడితే, కొంతమంది ఇంగ్లీషులో కాక భారతీయ భాషల్లోనే మాట్లాడుతారు. వీరి భాష పక్కనున్న ఇతరులకు అర్ధంకాక అపార్ధం చేసుకొని గొడవలు పడిన సందర్భాలు అమెరికాలో చాలానే ఉన్నాయి. అందువల్ల బయట ప్రదేశాలలో ఇంగ్లీషులో మాట్లాడితేనే మంచిది.

5. ఎదుటివారిని, ముఖ్యంగా అపరచితులను పరిశీలిస్తున్నట్టు కళ్ళప్పగించటం, తేరిపార చూడటం మంచిది కాదు. వారు నొచ్చుకునే అవకాశం ఉంది, ఈ చూపులు కూడా సమస్యలను తెచ్చిపెడతాయి.

6. లోకల్ విద్యార్ధులతోను, ప్రాంతీయులందరితోను కలిసిమెలసి గడిపే ప్రయత్నం చేయండి. అప్పుడు వాళ్లకి మీరు పరాయివారన్న భావన తగ్గుతుంది. భారతీయులతో మాత్రమే కలిసిమెలసి గడిపితే లోకల్‌వారికి మీరు పరాయి అన్న అభిప్రాయమే కలుగుతుంది.

సరయిన అవగాహన, ప్రణాళికాబద్ధ్ద జీవనం మిమ్మల్ని, మీ కుటుంబసభ్యుల్ని ఎన్నో రకాల విపత్తుల నుంచి కాపాడుతాయి. అమెరికాలో ఎదురయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అందరికీ ఉపయుక్తంగా ఉండేటట్టు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఈ మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. అమెరికాలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తానా అత్యవసర సహాయక బృందం (తానా ఎమర్జెన్సీ అసిస్టెన్స్ఆండ్ మానేజ్‌మెంట్ టీమ్-టీమ్ స్క్వేర్) ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని కూడా తానా అధ్యక్షుడు జయరాం కోమటి, ప్రెసిడెంట్ ఎలక్ట్ ప్రసాద్ తోటకూర, కార్యదర్శి మోహన్ నన్నపనేని ఆంధ్రజ్యోతికి తెలియజేశారు.

navya. డ్రైవింగ్
1. చట్టం చెప్పినా చెప్పకపోయినా, ఎప్పుడూ సీట్‌బెల్ట్ పెట్టుకోవాలి. కారులో ముందు సీట్లోనే కాక వెనక సీట్లో కూచున్నా సీట్‌బెల్ట్ పెట్టుకోవాలి. సీట్‌బెల్ట్ పెట్టుకోవటం వల్ల అత్యంత పెద్ద ప్రమాదాల్లో కూడా రక్షణ ఉంటుంది.

2. సరైన డ్రైవింగ్ లైసెన్స్, భీమా లేకుండా అమెరికాలో కారు నడపకండి.

3. భారతదేశంలో కారు నడిపే అనుభవం ఎంతగా ఉన్నా, అమెరికాలో కారు నడిపే ముందు. డ్రైవింగ్ పాఠాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి. ప్రాథమిక అవగాహన, నియమనిబంధనలు, పాటించాల్సిన వేగం మొదలైన వివరాలు అర్ధమవుతాయి. అలాకాని పక్షంలో కంగారు, అయోమయం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తగిన డ్రైవింగ్ తర్పీదు తప్పనిసరి. మరీ ముఖ్యంగా భారత దేశంలో కారు స్టీరింగ్ కుడివైపు ఉంటుంది. అమెరికాలో ఎడమవైపు ఉంటుంది. ఇది తొలిరోజుల్లో చాలా అయోమయానికి దారితీస్తుంది.

4. వీలైనంత వరకూ రాత్రి ప్రయాణాలను మానేయండి. మీరు పూర్తి జాగ్రత్తతో సమర్ధవంతంగా కారు నడిపినా, రాత్రి వేళల్లో కారు నడిపే తాగుబోతులు రాంగ్ రూట్‌లో వచ్చి యాక్సిడెంట్ చేసే ప్రమాదం ఉంది.

5. మీ కారు ముందుకు నడపలేని స్ధితిలో తప్ప బ్రేక్ డౌన్ కోసం నిర్దారించిన స్ధలాలలో కారు నిలపకండి. ఒకవేళ బ్రేక్ డౌన్ అయి అలా నిలిపితే, కారులోంచి దిగి ట్రాఫిక్‌కి దూరంగా సురక్షిత స్ధలానికి చేరటం మరువకండి.

6. ఎవరైనా పోలీసు అధికారి మీ కారు ఆపితే, ఆగగానే కారులోంచి దిగకండి. మీ చేతులు స్టీరింగ్ మీదే ఉంచి, పోలీసు ఆదేశాల కోసం వేచి చూడండి.

7. భారతదేశంలో కన్నా అమెరికాలో పాదచారులకి హక్కులు ఎక్కువ. అందువల్ల నడిస్తున్నవారిని గౌరవించడం, వారికి మన కారు తగలకుండా చూసుకోవడం చాలా అవసరం. నడిచివెళ్లేవారికి అలా నడిచే హక్కు లేదన్నట్టు ప్రవర్తించకండి.

8. కారు నడిపేప్పుడు, భద్రతకి అవరోధం కలిగించనంత దూరంలో కారు ఆగేలా మీ డ్రైవింగ్ ఉండాలి. అది అమెరికా డ్రైవింగ్‌లో ప్రాథమిక సూత్రం. ఈ దూరం ఎంత అన్నది, వాతావరణం పరిస్ధితుల మీద ఆధారపడి ఉంటుంది.

9. దారిలో ఏదయినా కారు ప్రమాదం కంటబడితే, స్వయంగా వారిని రక్షించాలనుకుని అనాలోచితంగా పరుగులు తీయకండి. తగిన జాగ్రత్త శిక్షణ లేకపోతే ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంకన్నా హానే ఎక్కువ జరుగుతుంది.

12. కారు నడుపుతూ టెక్ట్స్, ఎస్.ఎం.ఎస్.లకి సెల్‌ఫోన్‌లు వినియోగించకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్ వాడకం అమెరికాలో చాలాచోట్ల నిషిద్దం. అందువల్ల ప్రాంతీయ చట్టాలను తెలుసుకోండి.

navya. అపార్ ్టమెంట్, ఇల్లు, డార్మ్ రూమ్
1. ఎప్పుడూ మీ అపార్ట్‌మెంట్, ఇల్లు, డార్మ్ తలుపులు (క్రిందగానీ, మొదటి అంతస్థుగానీ అయితే కిటికీ తలుపులతో సహా) భద్రంగా తాళాలు వేయండి.

2. పొగ త్రాగటానికో, పార్టీలలో వంటలు చెయ్యటానికో స్మోక్ డిటెక్టర్స్ కనక్షన్ తొలగించటం, బద్దలు కొట్టడం లేదా ఆపటం చాలా ప్రమాదకరం.

3. గత కొంతకాలంగా అమెరికాలో దొంగలకి భారతీయుల ఇళ్ళు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనవాళ్లకి ఖరీదైన నగలను ఇళ్ళలో పెట్టుకోవటం అలవాటు. అది దొంగలకీ తెలుసు. పార్టీలలోనూ ముఖ్య సమావేశాలలోను మనవాళ్ల నగలు చూసి, దొంగలు వెంటాడి వచ్చిన సంఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. మీ విలువైన న గలు, పత్రాలు, ఇళ్ళలో, అపార్ట్‌మెంట్లలో ఉంచుకోవద్దు, సేఫ్ డిపాజిట్ బాక్సు (లాకర్స్) భద్రమైనది. దానికి అయ్యే ఖర్చు తక్కువే కాక మీకు మీ ఆస్తికి ఎంతో భద్రత.

4. అత్యవసర సమయంలో వచ్చి సహాయపడటానికి వీలుగా, మీకు బాగా నమ్మకస్తుడైన వ్యక్తి దగ్గర మీ ఇంటి మారు తాళం ఉండే ఏర్పాటు చేసుకోండి.

చట్టబద్ధ్ద ప్రవర్తన
1. చట్ట ప్రకారమే నడుచుకోండి. అమెరికాలో ఉన్నంత వరకూ ప్రాంతీయ చట్ట విధానాలకు కట్టుబడి ప్రవర్తించటం అవసరం. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు చేస్తే చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేదు.

2. ఒంటరిగా ఉన్న పసి పిల్లల జోలికి వెళ్ళకండి. మీ పక్కింటి పిల్లలైనా సరే, ఒంటరిగా ఉన్నప్పుడు వారి దగ్గరకు వెళ్ళటం అమెరికా సమాజంలో నిషిద్ధం. పిల్లలను ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేయవద్దు.

3. పిల్లలతో ఉన్న తల్లిదండ్రులుగానీ, పెద్దలుగానీ అనుమతిస్తే తప్ప పిల్లలకి తినుబండారాలు, పానీయాలు ఇవ్వకండి. 4. బహిరంగ ప్రదేశాల్లో, స్వీమ్మింగ్‌పూల్స్‌లో,థియేటర్లలో అపరిచితులను ముట్టుకోవటం గానీ వారిని రాసుకుని వెళ్ళటం కానీ, వారివైపు తదేకంగా చూడడం కాని చేయకండి.

5. ఎట్టి పరిస్థితులలోనూ ఒకరి తరపున మరొకరు దొంగ సంతకాలకు పాల్పడకండి.

6. ఒకవేళ దారి తప్పినా, ఇతరుల ఇళ్ల ప్రాంగణాలలోకి వెళ్ళకూడదు, వాళ్ళ తలుపులు తట్టకూడదు.

గృహ హింస
ఇతరులను హింసించటం అమెరికాలో చట్ట వ్యతిరేకం. ఎదుటివారి అనుమతి, ఇష్టం లేకుండా ముట్టకోవడం కూడా నిర్బంధ హింసగానే పరిగణిస్తారు. చట్టప్రకారం ఆ నిర్వచనం ఎంతో విపులంగా ఉంది. గృహహింసని అమెరికాలో చాలా తీవ్రంగా పరిగణిస్తారు.

1.అభిప్రాయభేదం, ఘర్షణ పడటం జరిగితే మొరటుతనానికి కానీ, శారీరక హింసకి కానీ దిగవద్దు. చిన్న తప్పిదం కూడా కెరియర్ మొత్తాన్నే కాక జీవితాన్నే నాశనం చేస్తుంది.

2. మీ భాగస్వామిని లేదా స్నేహితుల్ని, తదితర కుటుంబసభ్యుల్ని కోపంగా గట్టిగా తాకవద్దు, మీ వల్ల వారికి చిన్నపాటి దెబ్బ కూడా తగలకూడదు.

3. మీరు గృహహింసను ఎదుర్కొంటే వెంటనే సహాయాన్ని ఆర్ధించండి. దేశం మొత్తంగా ఎన్నో భారతీయ సంస్ధలు మీకు సహాయం చెయ్యటానికి సిద్దంగా ఉన్నాయి. గృహ హింస బాధితుల్ని ఆదుకోవటానికి ప్రతిచోట ప్రాంతీయ సంస్ధలు చాలా ఉన్నాయి.

తల్లిదండ్రులు, బంధువులతో జాగ్రత్త
1. పరిసరాలకి పూర్తిగా అలవాటు పడే వరకూ మీ తల్లిదండ్రులను, బంధువులను ఒంటరిగా వదలకండి.

2. సురక్షితం కానిప్రదేశాలలో వారిని ఒంటరిగా తిరగనివ్వకండి. మీ ఇంటి చుట్టపక్కల వారితో ప్రమాదం లేకపోయినా, ఇతర ప్రదేశాల నుంచి వచ్చే అగంతకుల వల్ల ప్రమాదం ఉండవచ్చు.

3. వారు మీ దగ్గర అతి తక్కువ కాలం గడపటానికి వచ్చినా, వారికి ఆరోగ్య భీమా తప్పనిసరిగా ఉండేలా చూడండి.

పిల్లలు
1.ఇంట్లోగానీ, కారులోగానీ, కారు వెలుపలగానీ పిల్లల్ని ఒంటరిగా వదలకండి.

2.ఏ షాపులోకో వెళ్ళినప్పుడు, కారులో ఒంటరిగా వదిలిన మీ పిల్లలు మీకు కనబడే దూరంలో ఉన్నా, వారిని అలా వదలకండి. అమెరికాలో చాలాచోట్ల చట్టరీత్యా అది నిషిద్దం కూడా.

3. మీ పిల్లలే కదా అని మొరటుగా, కర్కశంగా ప్రవర్తించటం, కొట్టటం లాంటి చర్యలకి పాల్పడకండి.

4. చిన్నపిల్లలకి అందేలా ఏ ప్రమాదకర వస్తవునూ వదలకండి.

5. పిల్లలకి ప్రమాదకరమైన ఆల్కహాల్ లాంటివి అందుబాటులో లేకుండా జాగ్రత్తపడండి. అటువంటివాటిని తాళం వేసి భద్రపరచటం మంచిది. పిల్లల విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్త అవసరం.

ఆరోగ్య, జీవిత మరియు ఆటో భీమాలు
1. వీసా కాలపరిమితి ఎంత తక్కువ కాలమయినా, అమెరికాలో ఉన్నన్ని రోజులు మంచి ఆరోగ్య భీమా ఉండటం ఎంతో అవసరం. అమెరికాలో వైద్యం ఎంతో ఖరీదు. ఇన్సూరెన్స్ లేకపోతే చాలామందికి భరించలేనంత ఖర్చు, సరైన ఆరోగ్యభీమా చేయించుకోని అశ్రద్ద వల్ల హెచ్-1, హెల్-1 తాత్కాలిక వీసాలతో అమెరికా వచ్చిన విద్యార్ధులు తీవ్రమైన ఇబ్బందుల పాలయిన సందర్భాలు అసంఖ్యాకం.

2. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులయినా రేపేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. గత ఆరు నెలల్లో 35 ఏళ్ళ వయసులోపు భారతీయులు మాసివ్ హార్ట్ఎటాక్‌తో మరణించిన సందర్భాలు పన్నెండు పైగా ఉన్నాయి.

3. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ధికంగా చాలామందికి అందుబాటులో ఉండే ప్రీమియం లభిస్తుంది. ముప్పై అయిదేళ్ళలోపు వయసు వారికి లక్ష డాలర్ల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి రెండుసార్లు రెస్టారెంట్‌లో పెట్టే ఖర్చుకి వచ్చేస్తుంది.అటువంటి భీమా సౌకర్యం, మీ దగ్గరవారిని తీవ్ర ఇబ్బంది నుంచి కాపాడుతుంది.

4. మీరు ఏదయినా సంస్ధకి లేదా కంపెనీకి చెందిన వారయితే, ఆ సంస్ధ ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ మరియు డిసెబిలిటీ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉందేమో తెలుసుకోండి. గ్రూప్ పాలసీలు చౌకగా లభిస్తాయి. అయితే, మీరు ఆ సంస్ధలో పనిచేస్తున్నంత వరకే ఆ భీమా సౌకర్యం ఉంటుందన్న విషయం గుర్తుంచుకోండి.

5. మంచి ఆటోమొబైల్ ఇన్సూరెన్స్ అత్యవసరం. ప్రాంతీయ చట్టాల ప్రకారం ఎంతో కొంత భీమా తప్పనిసరిగా ఉన్నా, మరికొంత భీమా థర్డ్‌పార్టీగా లేదా అంబ్రెల్లా కవరేజ్‌గా ఉండటం మంచిది.

బేంకింగ్, విల్లులు మరియు అత్యవసర వివరాలు
1. మీ వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని, అత్యవసర పరిస్ధితిలో సంప్రదించాల్సిన వివరాలను మీ సెల్‌ఫోన్‌లో మరియు పర్స్‌లో పొందుపరిచి ఉంచండి. మీ సెల్ ఫోన్‌లో ఐసిఇ( ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ) అని ఈ సమాచారాన్ని పొందుపరచవచ్చు.

2. మీ ఆర్దిక, వైవాహిక, వయో స్ధితి ఎలాంటివయినా మీరు విల్లు రాయటం ఎంతో మంచిది.

3. షూటింగ్ రేంజెస్, గన్ క్లబ్స్‌లో పాల్గొనే ముందు భద్రతాపరమైన తర్ఫీదుని తప్పనిసరిగా తీసుకోండి.

4. జలసంబంధమయిన వినోదాలు అంటే వైట్ వాటర్ రాఫ్టింగ్, ఫినిషింగ్, కేనింగ్ లాంటి సరదాలలో సేప్టీ జాకెట్స్ తప్పనిసరిగా ధరించండి.

5. మీరు పాల్గొనే క్రీడలకు తగిన పరికరాలు మంచి స్ధితిలో ఉన్నవి ఎంచుకోండి.