నన్ను అర్ధం చేసుకోవడానికి చాలా టైమ్ పడుతుంది . మొదటిసారి చూస్తే వీడెంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది . అలవాటయిన కొద్దీ మంచోడేమో అనిపిస్తాను. ఇంకొంచెం దగ్గరైతే చాలా తియ్యగా అనిపిస్తాను. ఇవి నా మాటలు కావు నా మిత్రుల గుండెచప్పుళ్లు . పుట్టాం!! ... పెరిగాం!! ... పోయాం!!... అన్నట్టు కాకుండా చేతనైనంత సాయం చేసి ఇంకో నలుగురికి ఆదర్శంగా నిలవాలన్నది నా ఆశ. ఎప్పుడూ నవ్వుతూ ,సంతోషంగా ఉంటా! గంట సీరియస్ గా ఉంటే జీవితంలో అరవై నిమిషాలు ఎందుకు పనికి రాకుండా పోయాయని అనుకుంటా.చుట్టూ జనం ఉండాలి నాకెప్పుడూ...ఒంటరితనం భరించలేను! నా అభిమతం వాస్తవికతకు దగ్గర, ఆశావాహధృక్పధం నా ఆయుధం ..
నాకు తెలీని విషయం నాకన్నా ఎంత చిన్నవాళ్లు చెప్పినా వింటాను.. "ఈ క్షణపు ఓటమే మరు క్షణపు గెలుపేమో ఈ నిమిషపు గెలుపే జీవితాన మలుపేమో " అని తలుస్తూ వాస్తవంలో బతుకుతూ భావుకతని ఆరాధిస్తూ తెలుగన్నా, తెలుగు సంస్కృతి అన్నా ఎంతో ఇష్టపడే సామాన్యుడిని నేను..
"కవితలు చెప్పే హృదయం వుంది !
ప్రేమించే మనసు వుంది ..
మనసులొన మంచి ఊహ వుంది ...
ఊహల లోకం లో ఒక ఆశ వుంది ..
కలసి వుండే కోమలి యెక్కడ ఉందో?..
చెప్పాలి అంటే, చాలా వుంది.. వినే ఓపిక ఉందా.....?"..!!
నాకు నచ్చిన కొన్ని మంచి వాక్యాలు మీకు కూడా నచ్చితే ఆచరించండి .....
1."ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే ఆగిపోయేవాడు అనామకుడు గానే మిగిలిపోతాడు"...
2.'అంతా తనదే' అన్నది మమకారము.'అంతాతనే' అన్నది అహంకారము...
3."నేడు రేపటికి 'నిన్న' అవుతుంది.నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే,నేడు కూడా బావుండాలి"...
4."మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్..Dead End....'అంతే అయిపోయింది ఇంకేమీ లేదు' అనుకున్నచోట ఆగిపోకు. ప్రక్కకి తిరుగు. మరోదారి కనపడుతుంది"...
5."నిన్నెవడయినా తప్పు పట్టాడంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు చేస్తున్నపని వాడికి నచ్చలేదన్నమాట"...
6."ఓడిపోయేవాడు ఒక్కసారే ఓడిపోతాడు.గేలిచేవాడు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతాడు.వందసార్లు ప్రయత్నిస్తాడు కాబట్టి"...
7."నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ అనందించు.అలా కాని పక్షంలో నీ అనందానికి అడ్డువచ్చే వారినందరిని నీ దినచర్య నుండి తోలగించు.రాజీపడి మాత్రం బ్రతక్కు"...
మర్చిపొయానండోయ్ అమెరికా విషయాలు చెప్పడం ...!అమెరికా వచ్చిన కొత్తల్లో బాగా ఖాళీ ఉండేది...అప్పుడు అనుకునే వాడిని, నేను ఎప్పుడు చూసినా ఇంత ఖాళీగా ఉంటున్నా, మరి అందరూ "బిజీ బిజీ లైఫ్. తినడానికి కూడా టైం ఉండదు, రెండు మూడు రోజులకొకసారి వండుకుని, దాచుకుని మరీ తింటూ ఉంటాం, స్నానానికి కూడా టైం ఉండదు" అని అంటూ ఉంటారేంటబ్బా అని ఒక ధర్మసందేహం వస్తూ ఉండేది ! కాని ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే తయారు అయింది !! ఆఖరికి ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడటానికి సమయం కేటాయించలేకపోతున్నా ! అలా అని వెనక్కు తిరిగి చూస్తే, పెద్దగా చేసింది ఎమీ లేదు.. !బహుశా ఇది నాతో నేను చేసే చెసే నిత్య సంఘర్షనేమో ..? నదికి - విధికి ఎదురీదడం కష్టమని చెప్పిన మహానుభావుల వాక్యాలు ఒక్కోసారి నిజమేమో అనిపిస్తుంటుంది ..!అమెరికా వచ్చి సంవత్సరం దాటింది! నా బాధలు చెప్పుకొనేంత పెద్దవి కాదు ..అలా అని మర్చిపోయెంత చిన్నవీ కావు..ఇంక వాగడం అంటారా అది సరేసరి ..
భావావేశానికి కాసేపు అడ్డుకట్టవేసి, సొంత విషయానికి వద్దాం ....!!
ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా, "ఎప్పుడొస్తున్నావయ్యా ?" అని పలికే నాన్న గంభీర స్వరం.... "నిన్ను చూడాలనుంది నాని" అని పలికే అమ్మ కమ్మని మాటలు విన్నప్పుడల్లా, దేవుడు మనిషికి రెక్కలు ఎందుకివ్వలేదా అని అనిపించేది.... చక్కగా ఇక్కడ ఎగిరి అక్కడ వాలి అందరినీ ఒకసారి చూసి వచ్చేయచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది !మళ్ళీ నా గొంతులో బాధ కనిపిస్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని, కొంచెం స్వరం పెంచి, "ఇంకెంతమ్మా ఒక ఏడాదేగా" అని చెప్తూ ఉంటా !ఇంకా మీతో పంచుకోవడనికి నా మదిలో చాలా మాటలున్నాయి...మళ్ళీ ఇలాగే సమయం దొరికినప్పుడు మిమ్మల్ని పలకరిస్తా !! అంత వరకూ సెలవు !
చిరునవ్వుతో..
మీ రాజ్