Wednesday, May 26, 2010

ఆత్మను అమ్ముకున్న పరిశ్రమ!!


చిత్రాలు మీరు చూడాలని మేం తీయడంలేదు. నాకోసం తీసుకుంటున్నాను. మిమ్మల్ని చూడమని నేను అడగలేదే? చూస్తే చూడండి లేకపోతే లేదు అని తెలుగులో ఓ వెలుగు వెలిగిన దర్శక నిర్మాత అన్న మాటలివి. ఎంత ఆత్మవంచన?! ఒకప్పుడు చిత్ర నిర్మాతలు, దర్శకులు మీకోసమే ఓ మంచి చిత్రాన్ని నిర్మించాం, మీకు తప్పక నచ్చుతుంది అని చెప్పేవారు. అందుకు తగ్గట్టు ఆ చిత్రం సామాజిక, కుటుంబ ప్రయోజనకారిగా వుండేది. కాని ఇప్పటి దర్శక నిర్మాతలు ఎంత ద్రోహబుద్ధితో చిత్రాలు తీస్తున్నారో పై ప్రకటన చూస్తేనే తెలుస్తుంది. మీకోసం మీరు తీసుకున్నప్పుడు, మా ఇళ్ల వద్ద ఇంత ఇంత పోస్టర్స్ వేయడం ఎందుకు? మా వీధిలోవున్న థియేటర్లో విడుదల చేయడం ఎందుకు? మీరొక్కరే మీ ఇంట్లో కూర్చుని ఎన్ని రోజులైనా ఆ చిత్రాన్ని చూసి తరించవచ్చుగదా! పక్కవాడికి హాని చెయ్యకుండా నీవు ఎటువంటి స్వేచ్ఛనైనా అనుభవించవచ్చు అని మనకు రాజ్యాంగం వుంది. కానీ మీరు చేస్తుందేంటి? అర్థ నగ్న పోస్టర్లు వేసి, అసభ్య సినిమా పేర్లుపెట్టి సమాజాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. పరువుగా తిరిగే కుటుంబాలు వీధులంట వెళ్లాలంటే తలదించుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. ఒకప్పుడు సినిమా థియేటర్లకు కుటుంబమంతా కలసి వెళ్లేందుకు జంకేవారు. ఇప్పుడు రోడ్లపైకి రావడానికి కూడా భయపడే వాతావరణాన్ని కల్పిస్తున్నారు. తన పిల్లలతో వెళ్లే తల్లికి, తండ్రికి గోడలపై, కటౌట్లపై కనిపించే శృంగార దృశ్యాలు, హీరోయిన్ పెదవి కొరుకుడు, హీరో అండర్‌వేర్ యాడ్స్‌కు ఫోజిచ్చినట్టు బట్టల్లేకుండా కనిపించే దృశ్యాలు, సినిమా వారికి కంటికి ఇంపుగా వుండవచ్చు కాక, సగటు ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నాయన్నది యదార్ధం. నాగరికత పెరిగేకొద్దీ సినిమావారి నాగరికత తిరోగమన దిశవైపునకు సాగుతోంది అనడానికి ఇప్పుడొస్తున్న చిత్రాలే ఉదాహరణ! ఈ చిత్రాల్లో ఒక కథ అంటూ వుండదు. సమాజానికి కాదు కదా, కనీసం ఓ వ్యక్తికైనా మంచి మాట చెప్పలేని అంధకార దశలో వున్నాయి నేటి చిత్రాలు. సినిమా అంటే వినోదంతోపాటు విజ్ఞానం అందించాలి. అలాంటి చిత్రాలు మచ్చుకైనా నేడు కానరావు. సరే...సినిమాలు చెత్త అని ఏనాడో థియేటర్లకు వెళ్లడం మానుకున్నాం. కనీసం మా ఇళ్లలో వుంటూ, అంగడి సరుకులు కొనేందుకైనా వీధుల్లోకి మేం వెళ్లవద్దా? తల్లీపిల్లల్ని విడదీసి రోడ్లపై నడిపిస్తున్నాయి ఇప్పుడొస్తున్న చిత్రాలు. ఒకేసారి ఇద్దరు నడిచి వెళ్లలేని దౌర్భాగ్య స్థితికి చేరుకుంటున్నాం. తలఎత్తి చూస్తే సారీ మా ఆయన ఇంట్లో ఉన్నాడు2 అంటూ రుతిక తన ఒంపుసొంపులతో కనిపిస్తుంది. అసలు ఈ పేరే చాలా జుగుస్సాకరంగా వినిపిస్తుంది. ఇహ సినిమా ఎంత అసహ్యంగా వుంటుందో? తాగుబోతులకోసం, వ్యభిచారులకోసం ఈ చిత్రం తీసినట్టు కనిపిస్తుంది. సమాజంలో యువతను పెడదోవ పట్టించేలా కథలు అల్లుతున్నారు. 3హైస్కూల్2 అనే చిత్రం పబ్లిసిటీకూడా ఇదేస్థాయిలోవుంది. నిండా పదిహేనేళ్లు లేని పిల్లవాడికి 33 ఏళ్ల మహిళతో సయ్యాటలట! హవ్వ...ఎంత భావదారిద్య్రం మూటకట్టుకుంటోందీ చిత్రపరిశ్రమ. యువతను పెడదోవ పట్టించి, దేశానికి మేలు చేయాల్సిన వారిని నిర్వీర్యం చేస్తోంది. ఇదంతా తమాషా చూసినట్టు చూస్తోంది సెన్సార్ బోర్డ్. తన ఫలాలు తాను పుచ్చుకుంటూ! సెన్సార్ సభ్యులు ముడుపులు తీసుకుని సర్ట్ఫికెట్లు అందిస్తున్నారన్న అపప్రద వుంది. లేకపోతే ఏ సమాజం ఎట్లాపోతే నాకేం అని అనుకునే సభ్యులకు కూడా పిల్లలు వుంటారు కదా! వాళ్లు చూడరా! సెన్సార్ సభ్యులైనంత మాత్రాన సమాజంలో వ్యక్తులు కాదా వారు?
పవిత్రమైన గురుశిష్యుల సంబంధాలను కూడా తెలుగుచిత్రపరిశ్రమ వదల్లేదు. వారిద్దరికీ ప్రేమ కల్పించి పెళ్లిళ్లు చేస్తోంది. ఆమధ్య ఓ దెయ్యాల చిత్రాలు తీసి భయపెడతానన్న దర్శకుడికి ఏ కథ రాయాలో తెలీక 3రెండు దెయ్యాల ప్రేమ కథ2ను అల్లుకున్నాడట. అది కూడా త్వరలో మన వీధిలో సినిమాగా మారబోతోంది. అంత పాతాళ స్థాయిలోకి దిగి మనవాళ్లు చిత్రాలు నిర్మిస్తుంటే పరిశ్రమ పచ్చగా పదికాలాలపాటు నిత్య కల్యాణం పచ్చతోరణంలా ఉండ కూడదని దీవించని ప్రేక్షకులెవరు? ముఖ్యంగా పిల్లల్ని కన్న తల్లిదండ్రులెవరు?
సెన్సార్ వారు సినిమా చూసాక ఎ, యు సర్ట్ఫికెట్లు ఇచ్చేసి దుమ్ము దులుపుకుంటే సరిపోతుందా? ఆ సినిమా తాలూకు ప్రభావం సమాజంపై ఏ విధంగా వుండబోతుంది అన్న ప్రశ్నలు వారికి రావా? వారు చదువులేని వారు కాదే! అనేక రంగాల్లో ఆరితేరిన వారినే కదా సెన్సార్ సభ్యులుగా నియమిస్తుంది. అందులో యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా వుండొచ్చు. వారికైనా ఇటువంటి గురుశిష్యుల ప్రేమ చిత్రాలు సమాజానికి హాని చేస్తాయని తెలీదా? సినిమా అంటే గతంలో మహిళా ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేసేవారు. కానీ ఇప్పుడు యువకులకోసమే చిత్రాలు తీస్తున్నామని పరిశ్రమ చెబుతోంది. యువతను ఇలా దేనికీ పనికిరానివారిగా ఎందుకు చేయదలుచుకున్నారో ఇటువంటి చిత్రాలను తీసే నిర్మాత, దర్శకులు, నటులను ప్రశ్నించాలి. చిన్నపిల్లలను అటువంటి నటన చేయడానికి అమ్ముకున్న బాలనటుల తల్లిదండ్రులను కూడా విచారణకు స్వీకరించాలి.
ఇలాంటి చెత్త చిత్రాలు ప్రజలు తిరగ్గొట్టినా, మా సినిమాలో చాలా గొప్ప సందేశమున్నదని మీడియా ముందు చెప్పుకునే దర్శక నిర్మాతలను సంఘ బహిష్కారం చేయాలి. ఇటువంటి వారి వలన సంఘం నాశనం అవుతుంది. కాసులకోసం ఎంతమంది జీవితాలను బలిపెడతారు? చిత్రాలు చూసి నేడు ఉపాధ్యాయులు, శిష్యులు పెళ్ళిళ్లు చేసుకున్న ఉదంతాలు చూస్తున్నాం. ఉపాధ్యాయ వృత్తి గౌరవించే ఏ ఉపాధ్యాయుడు తన బిడ్డలతో సమానమైన శిష్యులను పెళ్లి చేసుకోడు. ఇలా జరుగుతున్నాయంటే సంఘంలో అదో వికృతి. అర్హత, శిక్షణ లేని తక్కువ జీతంతో పనిచేసే వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. అటువంటి నైతిక విలువలు లేని ఉపాధ్యాయులపై ప్రభుత్వం చర్య తీసుకోవాలి. విద్యా వ్యవస్థలో గురుతర బాధ్యతను నెరవేర్చలేక కీచకులుగా మారి పోలీసులను, పంచాయతీ పెద్దలను, కోర్టులను ఆశ్రయించి, డబ్బు వెదజల్లి, తిరిగి ప్రభుత్వ జీతాలు తీసుకునే అపర రాక్షసులు తయారవుతున్నారు. పైగా ఆ సినిమాలో అలా చేయలేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ చూస్తూ మహిళా సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. ఈ చర్యలు మహిళలను ప్రతీకారానికైనా సిద్ధం చేస్తుంది లేదా మానసికంగా నైనా కుంగిపోతారు. ఇలాంటి చిత్రాలు సమాజానికి స్లో పాయిజన్‌లా పనిచేస్తూ, వ్యవస్థను నాశనం చేసే దిశగా నిర్మాణ మవుతున్నాయి. ఇప్పటికైనా పరిశ్రమలోని పెద్దలు, చిత్రకథలపట్ల సినిమా పేర్లపట్ల కొన్ని సూచనలు చేస్తూ చిత్రాలు నిర్మించాలని చెప్పగలగాలి. దానికి అందరు పెద్దవారూ సహకరించాలి. నా మనవళ్లు, నా కొడుకుల చిత్రాలు ఆడితే చాలు..దేశం ఏమైతే నాకెందుకు అని దొంగ నిద్ర నటించకండి. జీవితంలోనూ నటించకండి. ఇప్పటికైనా మేల్కొని సినిమా మాధ్యమం అధ్వాన్నమవుతున్న తీరుకు స్పందించండి. అలా చేయలేనినాడు మీకీర్తి తారాస్థాయి అని కలలు కనకండి. చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్న వాస్తవాన్ని గుర్తించండి. సినిమా అంటే డబ్బుల పాలు పితికే ఆవు అని అనుకోకండి. అనేకమంది ప్రేక్షకుల కలలతీరమని భావించండి. ఆ కలల తీరాన్ని అందమైన హరివిల్లుగానే వుంచే ప్రయత్నం చేయండి అప్పుడు ఎన్ని కాలాలైనా మీ కీర్తి తీరం పక్కన లైట్‌హౌస్‌లా కాంతులు వెదజల్లుతునే వుంటుంది. దయచేసి చెత్త, జుగుప్స కలిగించే చిత్రాలు, పలకడానికి ఇబ్బందిపడే పేర్లు, చూడడానికి వీల్లేని వాల్‌పోస్టర్లను కాల్చివేయండి. ఆత్మను అమ్ముకుంటున్న పరిశ్రమకు కౌన్సిలింగ్ ఇవ్వండి. ప్రేక్షకుల ఆత్మగౌరవాన్ని కాపాడండి!!

No comments: