ఐదు భూగ్రహాలుంటే గానీ అవసరాలు తీరవు..
దిగుబడులు రెట్టింపు చేస్తేనే కడుపు నిండేది.
శరవేగంగా అంతరిస్తున్న జీవ, వృక్షజాలం..
మిగిలేది చేపలు లేని సముద్రాలే..
ఆసియా, ఆఫ్రికా దేశాలకే ఎక్కువ ప్రమాదం
క్రీస్తు శకం... 2050. మరెంతో దూరం లేదు! ఇంకో నలభై ఏళ్లు! నేటి యువకులు నాటికి వృద్ధులవుతారు. పిల్లలు నడివయస్సులోకి వస్తారు. ఇప్పుడున్న వాళ్లలో చాలామంది అప్పటికి ఉండకపోవచ్చు. కానీ, ఈ భూమి మాత్రం ఉంటుంది. కానీ, ఎలా ఉంటుందో తెలుసా!?
ఆకలితో నకనకలాడుతుంటుంది. అగ్నిగోళంలా మండుతుంటుంది. నీళ్లు పాతాళంలో కదలాడుతుంటాయి. ధరలు అంతరిక్షంలో విహరిస్తుంటాయి. పచ్చదనం కోసం ప్రత్యేక అన్వేషణ సాగించాల్సి ఉంటుంది. కొన్ని నదులు చరిత్రలో కలిసిపోయి ఉంటాయి. కొన్ని లక్షల రకాల జీవ, వృక్ష జాలాలు అంతరించిపోతాయి. ఇవి అతిశయోక్తులు, అతి భయాలూ కావు! అంతర్జాతీయ ఆహార విధానం, పరిశోధన సంస్థ (ఐఎఫ్ఆర్ఐ), ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థతోపాటు పలు సంస్థలు, పర్యావరణ నిపుణులు చేస్తున్న హెచ్చరికలివి. వేస్తున్న అంచనాలివి!
2008లో ఓ మోస్తరు దుర్భిక్షానికే ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ఆకలితో అలమటించారు. గత ఏడాది 97 కోట్ల మంది పౌష్టికాహారలోపంతో సతమతమయ్యారు. మరి... 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లను దాటుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆహారోత్పత్తిని రెట్టింపు చేస్తే మినహా... వీరందరి కడుపులు నిండవు. ఈ 900 కోట్ల మంది ఏ లోటూ లేకుండా, ప్రస్తుత అమెరికన్ల తరహా జీవన విధానం అనుసరించాలంటే... ఈ భూమిపై ఉన్న వనరులు సరిపోవు.
భూమిలాంటి గ్రహాలు మరో ఐదు కావాలి. కానీ... మనకు ఏకైక దిక్కు ఈ భూమి! అప్పటికి ఈ భూమి మరింత నిస్సారంగా, మరింత నిర్జీవంగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా... 2050 నాటికి 25 లక్షల మంది పిల్లలు ఆకలితో నకనకలాడతారు. మరీ ముఖ్యంగా భారత్‌తో సహా దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలు ఆకలిరాజ్యాలుగా మారనున్నాయి. ఈ దేశాల్లో పంట దిగుబడులు భారీగా పడిపోతాయని ఐఎఫ్‌పీఆర్ఐ అంచనా వేసింది.
ఎందుకంటే, పిల్లలకు 2000లో లభిస్తున్న కేలరీలకంటే 2050లో తక్కువ కేలరీలను ఆహారంగా తీసుకుంటారు. ఇది అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు. కొన్ని దశాబ్దాలపాటు సాధించిన ప్రగతి... చిన్నారుల పౌష్టికాహార లోపం రూపంలో తుడిచిపెట్టుకుపోతుంది.
నీరసం నిండిన 'రేపటి పౌరుల'తో ప్రపంచం ఏం ముందుకు పోతుంది! అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఒక్కొక్కరికీ అందుబాటులో ఉండే ఆహారం తగ్గిపోతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2696 కేలరీల నుంచి 2410 కేలరీలకు.. ఆఫ్రికాదేశాల్లో 2316 కేలరీల నుంచి 1924 కేలరీలకు పడిపోతుంది. 2050నాటి సంగతి వదిలేద్దాం! కెన్యా, ఇథియోపియా, సోమాలియా, ఉగాండా తదితరదేశాల్లో పదేళ్లుగా తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. ఈ దేశాల్లో సుమారు 2.3 కోట్ల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ముందుముందు ప్రపంచపటంలో మరిన్ని ఇథియోపియాలు, సోమాలియాలు, ఉగాండాలు కనిపించనున్నాయి.
దిగుబడులు పెరిగేదెలా?
2050 నాటికి దిగుబడులను రెట్టింపు చేస్తే తప్ప మనుషుల ఆకలి తీరదు! కానీ... దిగుబడుల గతి నానాటికి దిగదుడుపుగానే ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ మార్పు, సారంలేని భూమి, అందుబాటులో లేని నీరు... వంటి అంశాలే కారణం. దీనివల్ల కెనడా, రష్యాలాంటి దేశాల్లో పంట దిగుబడి కాలం బాగా పెరుగుతుంది. దిగుబడి బాగా తగ్గుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రధాన ఆహార పంట అయిన గోధుమ దిగుబడి పెరగడం మాట అటుంచి తగ్గుతుంది.
సముద్ర మట్టాలు పెరిగి సాగుకు వినియోగమయ్యే భూమి భారీ స్థాయిలో మునిగిపోతుంది. ఈ మట్టం మూడు అడుగులు పెరిగితే బంగ్లాదేశ్‌లోని సాగుభూమిలో సగం మునిగిపోతుంది. ఇక... వరి దిగుబడిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న వియత్నాంలోని అధికభాగం నీట మునిగే అవకాశముంది. గంగ, సింధూ, యాంగ్జే వంటి నదులను సజీవంగా ఉంచే హిమాలయాల్లోని హిమనీ నదాలు కరిగిపోతున్నాయి. దీంతో ఈ నదీపరీవాహక ప్రాంతాల్లో సాగు ప్రశ్నార్థకమౌతుంది. ఆహార భద్రతకు ఇదే అతి పెద్ద ముప్పు. "ఇదో నిశ్శబ్ద సునామీ! ప్రపంచ దేశాలన్నీ ఆహార భద్రతకు తొలి ప్రాధాన్యమిస్తే తప్ప... 2050 నాటికి అందరి ఆకలి తీర్చలేం''అని ఐరాస హెచ్చరిస్తోంది.
జీవంలేని జాలం...
'జీవ వైవిధ్యం లేకున్నా మనుగడ సాధించగలం' అనే భ్రమల్లో మనిషి మునిగిపోయాడు. జీవ, జంతుజాలాన్ని అంతం చేస్తున్నాడు. 'అడవులు శరవేగంగా క్షీణిస్తాయి. జల వనరులను ఆల్గే (నాచు) ఆక్రమిస్తుంది. కోరల్ రీఫ్స్ (పగడపు దీవులు) సామూహికంగా అంతరిస్తాయి' అని గ్లోబల్ బయోడైవర్సిటీ ఔట్‌లుక్ (జీబీవో-3) ఇటీవలే హెచ్చరించింది. 1970తో పోల్చితే 2006 నాటికి అన్ని రకాల పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు, ఉభయ చరాల వంటి జీవులు మూడోవంతు పడిపోయినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. నిజానికి.. ఏటా 2 నుంచి 5 లక్షల కోట్ల డాలర్ల విలువైన అడవులు అంతరిస్తున్నాయి. కేవలం 20 ఏళ్లలో 35 శాతం మడ అడవులు అంతరించాయి. 5490 క్షీరదాల్లో 79 రకాల క్షీరదాలు అంతరించాయి. ఇవన్నీ... మనిషిని సైతం అంతరించేలా చేసే విపరిణామాలే! మనమూ అంతరిద్దామా?
చేపలన్నీ ఖాళీ!
పర్యావరణ ప్రమాదాలపై ఇప్పటిదాకా వస్తున్న అంచనాలన్నీ నిజమైతే... 2050 నాటికి చేపలు లేని సముద్రాలే మిగులుతాయి. ప్రపంచవ్యాప్తంగా మత్స్య పరిశ్రమకు విచ్చలవిడిగా ఇస్తున్న సబ్సిడీలకు కోత వేసి, చేపలకు రక్షిత ప్రాంతాలను (ప్రొటెక్టెడ్ జోన్స్) ఏర్పాటు చేస్తే మినహా మత్స్య సంపదను కాపాడుకోలేమని స్పష్టం చేశారు.
పది పర్యావరణ పాపాలు
1. గ్రీన్ హౌస్ వాయువులు
గ్రీన్‌హౌస్ వాయువులు ఇబ్బడి ముబ్బడిగా పెంచడం అతిపెద్ద పా పం. శిలాజ ఇంధన వినియోగం బాగా పెరిగిపోవడంతో భూతాపాన్ని తగ్గించలేని విషమ స్థితికి మానవ జాతి చేరుకుంటోందని 1963 సదస్సు నుంచి శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు.
2. వియత్నాం జీవవిధ్వంసం
వియత్నాం యుద్ధం సందర్భంగా అమెరికా సైన్యం విష రసాయనాలను ప్రయోగించింది. వీటిలో అత్యంత ప్ర మాదకరమైనది ఏజెంట్ ఆరెంజ్! వియ త్నాం యుద్ధంలో ఏజెంట్ ఆరెంజ్ ఒక్క టే 48 లక్షల వియత్నాంవాసులపై ప్రభావం చూపింది. ఈ రసాయనాలు ఆ ప్రాంత పర్యావరణాన్నీ దారుణంగా దెబ్బతీశాయి. దీని నుంచే జీవ విధ్వంసం (ఎకోసైడ్) అనే పదం పుట్టింది.
3. భోపాల్ గ్యాస్ విషాదం
ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పారిశ్రామిక ఉపద్రవం భోపాల్ గ్యాస్ విషాదం. 1984 డిసెంబర్ మూడో తేదీన భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ప్లాంట్ నుంచి 32 టన్నుల విష వాయువులు లీకయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం 20వేల మంది మరణించగా, లక్షల మంది జీవచ్ఛవాలయ్యారు.
4. సరస్సుకు ఉరి
విక్టోరియా సర స్సు ఆఫ్రికాలోనే అతిపెద్ద సరస్సు. కానీ, పర్యావరణ విధ్వంసం కారణంగా నెమ్మదిగా ఇది జీవాన్ని కోల్పోతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈ సరస్సు ఏడాదికి 150 అడుగుల చొప్పున కుంగిపోతోంది. ఈ పర్యావరణ విధ్వంసం వలన, ఈ సరస్సుపై ఆధారపడిన నాలుగు కోట్లమంది భవిత ప్రశ్నార్థకం.
5. చెర్నోబిల్ అణు విషాదం
ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు కర్మాగారంలో పేలుడు.. అత్యంత దారుణమైన అణు విధ్వం సం. 1986లో జరిగిన ఈ దుర్ఘటనలో వెలువడిన రేడియేషన్‌తో 4,000 మందికి కేన్సర్ సో కింది.
6. చమురు సంక్షోభం
ఎక్సాన్ కంపెనీ 1989లో అలాస్కాలోని ప్రిన్స్ విలియమ్ సౌండ్‌లో 1.1 కోట్ల గ్యాలన్ల చమురును పారబోసింది. అయితే, ఈ చమురు తెట్ల కారణంగా పర్యావరణానికి ఏర్పడే ముప్పుపై ఎక్సాన్ వాల్డెజ్ ప్రజల్లో చైతన్యం కలిగించింది.
7.అమెజాన్ విధ్వంసం
దశాబ్దాలుగా చెట్లను కొట్టేయడం, సోయాబీన్ సాగు చేపట్టడం, రోడ్లను నిర్మించడం తదితరాల కారణంగా అమెజాన్‌లోని వర్షాధార అడవుల్లో 20 శాతం కనుమరుగయ్యాయి.
8. సముద్రాలకు ఉపద్రవం
కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్‌లో ఎప్పుడూ నిండు గా నీళ్లుంటాయి. కానీ, జలాలు కలుషితం కావడంతో 1992లో అందులోని కాడ్ (పెద్ద సముద్రపు చేప)ల న్నీ చచ్చిపోయాయి. సముద్ర జీవులు అంతరించి.. మానవుల జీవనోపాధీ పడిపోతోంది.
9. మినమట శాపం
జపాన్‌లో ఛిస్సో కార్పొరేషన్ 1932 నుంచి 1968 వరకు పారిశ్రామిక వ్యర్థ జలాలను మినమట నగరం చుట్టుపక్కల ఉన్న సముద్రంలోకి వదిలేసేది. వాటిలోని పాదరసం కారణంగా చుట్టుపక్కల జీవించే వేలాదిమంది అస్వస్థులయ్యారు. ఈ విధ్వంసం పేరిట 'చిస్సో-మినమట' అనే నరాల వ్యాధి పుట్టుకొచ్చింది.
10. ధూళి తుపానులు
1930-40 మధ్యకాలంలో.. అమెరికాలో మార్కెట్ ఆధారిత సాగు పద్ధతులను అవలంబించారు. మైదాన ప్రాంతాల్లో సాగుకు అనుకూలమైన ప్రాంతాలను భారీ గా దున్నేశారు. ఒకే పంటను సాగు చేశారు. ఫలితంగా ఆ దేశ చరిత్రలోనే దారుణమైన పర్యావరణ విధ్వంసం చోటుచేసుకుంది. దీంతో ఏర్పడినధూళి తుపానులు కారణంగా 25 లక్షలమంది నిర్వాసితులయ్యారు. అనంతరకాలంలో భారీ తుపాను వెల్లువెత్తింది.
No comments:
Post a Comment